"आक्टर क्या है? डैरेक्टर की हाथ की कटपुतिलिया!" (ఆక్టర్ ఎవరు? డైరెక్టర్ చేతిలోని తోలుబొమ్మ!) అని "చుప్కే చుప్కే" సినిమాలో ధర్మేంద్ర చేత అనిపిస్తారు హృషికేష్ ముఖర్జీ. అదే ముక్కను కొంచెం ఘాటుగా చెప్పారు నసీరుద్దీన్ షా ఒకానొక ఇంటర్వ్యూలో - "I feel actors are overpaid and over priviledged people to start with. They take terrible advantage of the position they are in." సినిమా అనేది దర్శకుని మాధ్యమం. గత కొన్నేళ్ళుగా తెలుగు సినిమా ఎంత దుఃస్థితికి దిగజారిదంటే, సినిమాకు చెందిన ప్రతి ఒక్క అంశం "హీరో" చేతిలో కీలుబొమ్మైలైపోయాయి. సాధారణంగా ప్రదర్శనల్లో నాణ్యత లోపిస్తే డబ్బు చెల్లించి టికెట్ కొన్నందుకు "ప్రేక్షకుడు" రాళ్ళురువ్వుతాడు. ఇటీవల వచ్చిన చాలా తెలుగు సినిమాలు "ప్రేక్షకుడి" డబ్బు, సమయం, తెలివిపై వేసిన జోకుల్లా అనిపించాయి, నాకైతే! రెండున్నర గంటల సేపు లోకువ కట్టడం చాలదన్నట్టు, ఆడియో ఫంక్షన్లలో, ప్లాటినమ్ డిస్కులని, పది-ఇరవై-పాతిక రోజుల పండుగులని నానా ఆర్భ్హాటం చేసి, ఆపై అందులో గొప్పలు చెప్పుకోవడం, తొడలు కొట్టుకోవడం. ఉఫ్.. మధ్యలో బాణం, గగనం లాంటి సినిమాలూ వచ్చాయి. అవేంటో ఏడ్చేవాళ్ళని మభ్యపెట్టడానికి అన్నట్టు ఉన్నాయేగానీ, ఒక తీరూ తెన్నూ కనిపించలేదు.
అయినా చూడక తప్పని పరిస్థితులు ఏర్పడినప్పుడు, "You begin the joke. I'll complete it." అన్న తరహాలో చూడ్డం మొదలెట్టాను. అందుకే నన్ను "మగధీర" అంతలా నవ్వించింది. ఇవ్వాళ "ఈగ" సినిమా కూడా అదే నమ్మకం చూశాను. సినిమా నాకు నచ్చింది, కాకపోతే సినిమా గొప్పతనం వల్ల కాదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఉన్న దీనావస్థ వల్ల ఈ సినిమా నచ్చింది.
కథలో చెప్పుకోడానికి ఏమీ లేదు. ఏమీ లేదు. ఇప్పటికి కొన్ని వందల సినిమాలు వచ్చాయి ఈ కథాంశంతో. అయితే, అట్లా అరగదీసున్న కథనే ఒక "ఈగ"ను హీరో చేసి తీయటం నచ్చింది. ఒప్పుకునే ధైర్యం ఉండాలే కానీ, ఈ సినిమా ద్వారా నాకు కనిపిస్తున్న మెసేజ్ ఒక్కటే - "హీరో.. హీరోయిజం అని విరగబడుతున్నారే! నిజానికి అదే కథలో హీరోగా ఓ మనిషి వేసినా, లేక ఒక పురుగు వేసినా పెద్ద తేడా ఉండదు." అనే! మన సదరు హీరోలకన్నా అన్ని విధాల ఈగ వెయ్యి రెట్లు నయం.
- తలాతోకలేని డైలాగులు కొట్టకుండా, సైలెంటుగా వైలెంటుగా తన పని తాను చేసుకుపోతుంది.
- ప్రస్తుతం వస్తున్న చాలా హీరోలకన్నా ఈగ చూడముచ్చటగా కనిపించింది.
- ఈగ పెట్టినన్ని ఎక్స్-ప్రెషన్స్ లో ఎన్ని మన హ్యూమన్-జీరోలు పెట్టగలరో నాకు డౌటే!
- సాధారణంగా సినిమాల్లో కనిపించే అర్థంపర్థంలేని చితకబాదుడుకన్నా ఈగకు తెలివితో కొట్టడం తెల్సు.
- ఈగకు ప్రేమించడమూ, పగతీసుకోవడమే కాదు, ప్రేమించిన పిల్లని వికారంగా తిట్టుకోదు. It's plain respect here!
- ఈగే కాదు, ఈగ లవర్ కూడా పనిపాటా చేతనైన పిల్ల. బట్టలు కుదురుగా వేసుకుంటుంది. ఒక పనో, వ్యాపకమో తెల్సిన పిల్ల. అప్పుడప్పుడూ బుర్రకూడా వాడుతుంది.
- అన్నింటికన్నా "ఈగ" ఛానెల్, ఛానెల్ కు వచ్చి "మా సినిమా చూసిపెట్టండి బాబయ్యా!" అంటూ చెవిలో జోరీగ కాలేదు. అంతకన్నా ముఖ్యంగా "మా తాతయ్య, మా బాబాయ్, మా నాన్న.." అంటూ ఫామిలీ ఆటోబ్రయోగ్రాఫీ చదువుకురాదు, చీటికిమాటికి.
పైన పేర్కొన్నవి మన సినిమాల్లో కనిపించటం దుర్లభం కనుక, ఏ చెట్టూ లేని చోట ఆముదమే మహావృక్షం అయినట్టు ఉంది పరిస్థితి. If not for the technical brilliance, there's nothing much to take home from it. Rajamouli still fails to impress me as a story-teller. ఈ సినిమాకు రెండున్నర గంటలు అనవసరం. రికార్డులు, అవార్డులు కాక ఈ సినిమా చేసే ఏకైక పనికొచ్చేపని హీరోలకు వారు ఆక్టర్లు మాత్రమే అని గుర్తుచేయడం. అందులో సఫలమై, రానున్న రోజుల్లో కాస్తో-కూస్తో సరుకున్న సినిమాలు వస్తే, బహుశా అప్పుడేమన్నా ఈగ ఒక మైలురాయి అవుతుందేమో కానీ, అంతవరకూ మాత్రం it's a typical Telugu movie. Just that the lead happens to be an animated creature, hence bringing some hope and respite to otherwise fed up audience.